మేడ్చల్, నవంబర్5(నమస్తే తెలంగాణ): ధనుర్వాతం వ్యాధి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలను తప్పకుండా వేయించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, టాస్క్‌ఫోర్స్ కమిటీతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తం గా టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలు తప్పకుండా ఇప్పించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్ల్యక్షంగా వ్యవహరించారాదని సూచించారు. 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారందరికీ ఈ వ్యాక్సిన్లు ఇప్పించాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,43,801 మంది విద్యార్థులు ఉండగా, అందులో పది సంవత్సరాల వయస్సు గల వారు 57,450 మంది ఉండగా, 16 సంవత్సరాల వయస్సు గల వారు 49,627 మంది ఉన్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంమ్లు, అంగన్వాడీ టీచర్లుతో కలిపి జిల్లాలో 270 బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి రోజూ ఒక బృందం 250 మందికి వ్యాక్సిన్లు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, డీఆర్డీడీఏ అధికారులతో కలెక్టర్ హరీశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఏ మాత్రం నిర్ల్యక్షం వహించరాదని కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులు వివరాలను తెలుసుకున్నారు. అన్ని రకాల అభివృద్ధి పనులను ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్న దృష్ట్యా పనులను పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. పూర్తికాని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, వైద్యాధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు పద్మజారాణి, రమణామూర్తి, ఝాన్సీరాణి, పావని, వేణుగోపాల్‌రెడ్డి, విజయకుమారి, నారాయణరావు, ఆనంద్, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.