కవాడిగూడ, నవంబర్ 3 : కార్తిక మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం (నాల్గవ రోజు) వైభవోపేతంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తిటీవీ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి శ్రీ గురురాఘవేంద్రస్వామి మహాపూజ, అశ్వవాహన సేన నిర్వహించారు. ప్రవచన కర్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి సమక్షంలో నర్మదా బాణలింగానికి భస్మార్చన, శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో విశేష పూజల మధ్య వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగాసాగింది. అనంతరం వేములవాడ, యాదాద్రి, మంత్రాలయం ఉత్సవమూర్తుల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించిపోయారు. కొండవీటి జ్యోతిర్మయి బృందం చేసిన భక్తి గీతాలాపనలు భక్తులను ఎంతగానో అలరించాయి.