కవాడిగూడ, నవంబర్ 2: పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా పేదలకు వైద్యాన్ని అందిస్తున్నది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్, భోలక్‌పూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో వైద్యాధికారులు డాక్టర్ జి.శ్రీనివాస్, డాక్టర్ మౌనిక నేతృత్వంలో ప్రతి గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన వయోవృద్ధులు తమ ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి దవాఖానకు చేరుకొని మెరుగైన వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు పొందుతున్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు అత్యంత జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా పడుకునేముందు వెచ్చగా వుండే దుప్పట్లు వాడాలని వైద్యులు సూచించారు.
వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గురువారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి.. మందులు పంపిణీ చేస్తున్నది. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే దవాఖానకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఈ అవకాశాన్ని పేదలు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు..
– డాక్టర్ జి. శ్రీనివాస్, వైద్యాధికారి, ముషీరాబాద్, భోలక్‌పూర్-యూపీహెచ్సీ
ముషీరాబాద్, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలలో ఉచితంగా వయోవృద్ధులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. బ్లడ్, షుగర్, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత పరీక్షలు, దంత, నేత్రాలు, ముక్కు, చెవి, ఫిజియోథెరపీ, లివర్ ఫంక్షన్, హెచ్‌బీ ఏ1సీ, లిఫిట్ ప్రొఫైల్, డైరెక్ట్ ఎల్డీఎల్, నైట్రోజన్ తదితర వైద్య పరీక్షలు వెంటనే నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. అవసరమైన వారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ, ఉస్మానియా దవాఖాలకు పంపిస్తున్నారు.