ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని 44 కాలనీల ప్రజలు 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్న రిజిస్ట్రేషన్ల సమస్యకు జీవో 118తో ముగింపు పలికినట్లు చెప్పారు. బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో జీవో కాపీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మంత్రి అందజేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సిక్కు సోదరుల కోసం గురుద్వారా నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మహమూద్‌అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్త, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు.
– సిటీ బ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్
పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మాది. నష్టం చేసేది కానేకాదు. మీరు కోరుకుంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మీ మొహంలో చిరునవ్వులు చూడాలని ఎప్పుడూ కోరుకుంటాం. కొన్ని సమస్యల పరిష్కారానికి ఆలస్యం జరగొచ్చు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే కొంత సమయం తీసుకున్నాం.
ఎల్బీనగర్లో చౌరస్తా 8 ఏండ్ల కింద ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల కోసం రూ.1200 కోట్లు, మంచినీటి కోసం రూ.400 కోట్లు, ఎస్ఎన్డీపీ కింద రూ.1,013 కోట్లు కేటాయించాం. కావాలంటే ఇంకా నిధులు ఇస్తాం. ఇదే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
6 నియోజకవర్గాలు.. 44 కాలనీల సోదర సోదరీమణులకు ఇది శుభవార్త 118 జీవోను అక్టోబర్ 28న విడుదల చేశాం. వెయ్యి గజాల్లోపు ఉండే ప్రతి నిర్మాణాన్ని రెగ్యులరైజ్ చేస్తాం. అది కూడా గజానికి రూ.250 నామమాత్రపు రుసుముతోనే. ఆర్నెళ్లలోనే మీ అందరికీ పట్టాలు అందజేస్తాం.
ఎన్నో ఏండ్లుగా రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కానికి ఎదురు చూ స్తున్నాం. ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చారు. కానీ మంత్రి కేటీఆర్ ఈ సమస్యపై నిబద్ధతతో ఉ న్నారు. ఎన్ని అడ్డుంకులు ఉన్నా వాటిని పరిష్కరించి జీవోను తీసుకువచ్చారు. ఇదంతా కేటీఆర్ కృషితోనే సాధ్యమయింది.
– మహేందర్‌రెడ్డి, ఎస్కేడీ నగర్
సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: ఇది ఒక్క రోజు పోరాటం కాదు..15 ఏండ్ల పోరాటం. గతంలో ప్రతి ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ..తెలంగాణ ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసి ఇండ్ల క్రమబద్ధీకరణకు శాశ్వత పరిష్కారం చూపించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మన నగరం సభా వేదికపైనే జీవో 118 కాపీని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అందజేసి లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించి ఇండ్లు నిర్మించుకున్నాక నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువులు ఎలా? అని గోడు వెళ్లబోసుకున్నప్పటికీ గత పాలకులు కనికరం చూపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 118 జీవోతో ఎల్బీనగర్ నియోజకవర్గంతోపాటు రాజేంద్ర నగర్, మేడ్చల్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వెయ్యి గజాల వరకు ఉండే ప్రతి నిర్మాణాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని, గజానికి రూ.250 నామమాత్రపు రుసుముతో రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. వంద గజాలు ఉంటే రూ.25వేలు, 200 గజాలు ఉంటే రూ.50వేలు, 400 గజాలు ఉంటే రూ.లక్ష చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే చేతికి పట్టాను అందజేస్తామని చెప్పారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఇంకా మిగిలిపోయిన ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఇన్నేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసింది తప్పితే నష్టం చేయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోరుకునే సర్కార్ మాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పొచ్చని, ఎల్బీనగర్ చౌరస్తా ఎనిమిదేండ్ల కింద ఎలా ఉండేది? ఇప్పుడు ఎట్లా అయ్యిందో చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే రూ.1200 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించామని, రూ.450 కోట్లతో తాగునీరందించామని, ఎస్ఎన్డీపీ కింద నాలాల కోసం రూ.113 కోట్లను కేటాయించామని చెప్పారు. రాజేంద్రనగర్ యూనివర్శిటీ పరిధిలోని భూసమస్యలను కూడా పరిష్కరిస్తామని, గురుద్వార్ కోసం సిక్కులకు స్థలం కేటాయించే బాధ్యత నాది అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, టీఎస్ ఐడీసీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, రెడ్కో చైర్మన్ వై. సతీశ్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, మున్సిపల్ పరిపాలనా విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాశ్‌గౌడ్, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న , ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, జీవీ సాగర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సామ రమణారెడ్డి, చెరుకు సంగీత, జిన్నారం విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, అనంతుల రాజారెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, తెలంగాణ సిక్కు సొసైటీ అధ్యక్షురాలు తేజ్‌దీప్ కౌర్ మీనన్, లింగాల రాహుల్‌గౌడ్, జక్కల శ్రీశైలం యాదవ్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, చింతల రవికుమార్ గుప్తతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన మన నగరం కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు కోటి ఆశలతో సభకు హాజరయ్యారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాలనీలతో పాటుగా మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెండు కాలనీలు, రాజేంద్రనగర్‌లోని సిక్ చావునీ ప్రాంత వాసులు, నాంపల్లి నియోజకవర్గంలోని కొన్ని కాలనీల వాసులకు ఈ జీవో 118తో మేలు జరగనుండటంతో భారీగా తరలివచ్చారు. వారి అంచనాలకు అక్షరరూపం ఇస్తూ మంత్రి కేటీఆర్ జీవో 118 కాపీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అందజేయడంతో ఆయా కాలనీవాసులు హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. సభా వేదికపై కాలనీల పేర్లను చదవడంతో పాటుగా కొన్ని కాలనీల పేర్లు మిస్ అయినా వాటికి కూడా పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ చెప్పడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో సభా ప్రాంగణమంతా మారుమోగింది.
హూడా అప్రూవల్ లే అవుట్లో స్థలాలు కొన్నాం. ఇండ్లు కట్టుకున్నాం. అధికారుల తప్పిదంతో మా స్థలాన్ని 22ఎలో చేర్చి రిజిస్ట్రేషన్లు బ్యాన్ చేశారు. దీంతో 15 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చొరవతో సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడింది. కాలనీవాసులందరం పండుగ చేసుకుంటున్నాం.
– సాయిబాబు , బీఎన్‌రెడ్డినగర్
మా కాలనీలో రిజిస్ట్రేషన్ల సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందన్న నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం శ్రమించారు. మా కాలనీలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
– పోగుల రాంబాబు, వైదేహినగర్
1951 నుంచి ఈ సమస్య ఉంది. నిజాం ప్రభుత్వంలో పంజాబ్ సిపాయిలు సిఖ్చాక్నీ వచ్చి
స్థిరపడ్డారు. నిజాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాక కూడా స్థలానికి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. యూఎల్సీ స్థలంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 1200 కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. జీవో 118 ద్వారా మా స్థలాల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదములు.
– తేజ్‌దీప్ కౌర్ మీనన్ (రిటైర్డ్ ఐపీఎస్) అధ్యక్షురాలు, తెలంగాణ సిక్కు సొసైటీ
20 ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారినా మా నిరీక్షణకు తెరపడలేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల ప్రత్యేక చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించింది. చాలా సంతోషంగా ఉన్నాం.
– అంజిరెడ్డి, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, నాగోలు డివిజన్ తెలంగాణ మహాత్ముడు
పేదల సంక్షేమానికి పాటుపడిన నాయకుడు కేసీఆర్ మినహా దేశంలోనే ఎవరూ లేరు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఈ సమస్యలను పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు జీవో 118 ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిష్కారం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ మహాత్ముడు సీఎం కేసీఆర్. – హోంమంత్రి మహమూద్ అలీ
ఇది ఒక చరిత్ర. ఈ ఒక్క జీవోతో ఒక్క ఎల్బీనగర్‌కే కాదు చాలా మందికి లబ్ధి జరుగుతుంది. ఈ భూముల రిజిస్ట్రేషన్ సమస్యను నేను ఎంపీగా ఉన్నప్పుడే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయా. అప్పుడే ఉప్పల్ భగాయత్ భూముల సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పుడు ఎల్బీనగర్ భూముల సమస్య కూడా పరిష్కారం అయ్యింది. దీంతో నా జన్మ ధన్యమైంది.
– కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
ఎన్నో ఏండ్ల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భూ సమస్యలను పరిష్కారం చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుత ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం నా అదృష్టం. యూనివర్సిటీ భూముల్లో ఉన్న మరో రెండు కాలనీల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నా.
– రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
పేద, మద్యతరగతి ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇండ్లు కట్టుకున్నాం. పెండ్లిళ్లకు, అవసరాలకు అమ్మాలన్నా యూఎల్సీ ఉండటంతో ఎవరూ కొనడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ సమస్యలను తీర్చి పుణ్యం కట్టుకుంటున్నారు. మా కాలనీ తరపున వారికి ధన్యవాదములు.
– ఎం. నర్సింహారెడ్డి, శ్రీరామహిల్స్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్
ఎన్నో ఏండ్లుగా యూఎల్సీ సమస్యలతో ఇబ్బందులు పడ్డాం. ఎందరికో చెప్పాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ప్రత్యేక జీవోతో మా సమస్యను పరిష్కరించారు. కాలనీవాసులందరం ఎంతో ఆనందంగా ఉన్నాం.
– కె. చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనిధి కాలనీ, కర్మన్‌ఘాట్
ఎస్వీ కాలనీలోని దశాబ్దాల కాలంగా యూఎల్సీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్వీ కాలనీలో ఏండ్ల తరబడి సమస్యకు పరిష్కారం చూపారు. సమస్యలను తీర్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలకు మా కాలనీ తరపున హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
– శాగ రోజారెడ్డి, ఎస్వీ కాలనీ, చంపాపేట్ డివిజన్
మాధవనగర్ కాలనీలోని సుమారు 3 ఎకరాల స్థలంలో చేసిన వెంచర్లో లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేశాం. యూఎల్సీ సమస్యలతో 15 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడం హర్షణీయం. మా కాలనీ తరపున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– గోగిరెడ్డి అంజిరెడ్డి, మాధవనగర్ కాలనీ, చంపాపేట డివిజన్
అసైన్డ్, యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్యలతో 20 ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలకు ఈ సమస్యలను విన్నవించినా పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈ సమస్యను పరిష్కారం చేసింది. ఈ సమస్యపై పలుమార్లు మంత్రి కేటీఆర్‌ను, సీఎం కేసీఆర్‌ను ఇబ్బందులకు గురి చేశా. వారు ఎంతో సహృదయంతో దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చేశారు. ఒకే ఒక్క జీవోతో కాలనీల సమస్యలు తీరబోతున్నాయి. వారికి ఇదే వేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నా. ఇక ఫతుల్లగూడ సర్వే నెంబర్ 58లోని పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా. అలాగే ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వరకు మెట్రో రైలును పొడగిస్తే బాగుంటుంది. ఉప్పల్ స్టేషన్ నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఎల్బీనగర్ వరకు మెట్రోను లింక్ చేయాలి. అలాగే నందనవనం ఇండ్లను మరమ్మతులు చేయించి, డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే నిర్మించాలని విజ్ఞప్తి.
– ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎన్నో ఏండ్ల క్రితం ప్లాట్లు కొని, ఇండ్లు కట్టుకున్నాం. 2007 తర్వాత యూఎల్‌సీలో ఉందని సమస్య సృష్టించారు. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధతో మంత్రి
కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రత్యేక జీవో తేవడం శుభ పరిణామం.
– ఎం. శ్యాంసుందర్‌రెడ్డి, వివేకానందనగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్