కవాడిగూడ, నవంబర్ 2: కార్తికమాసాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన కోటి దీపోత్సవం మూడోరోజు బుధవారం రాత్రి ఆధ్యంతం శోభాయమానంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తిటీవీ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల నేతృత్వంలో జరుగుతున్న ఈ కోటి దీపోత్సవం కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేసి కోటికాంతులను వెలిగించారు. సాయంత్రం 6 గంటల నుండి స్టేడియం ప్రాంగణమంతా భక్తులకోలాహంతో కిక్కిరిసిపోయింది.
తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానందసరస్వతి స్వామి, తిరుపతి లలితాపీఠం పీఠాధిపతి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి, ప్రవచనకర్త డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి నేతృత్వంలో సమక్షంలో కాజీపేట శ్వేతార్కగణపతికి సప్తవర్ణాభిషేకం, కోటిగరికార్చనల మధ్య కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారిని మూషిక వాహనంపై కాణిపాకం ఉత్సవమూర్తుల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కోటీదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌లు హాజరై స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.