సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ అశాంతిని సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మునుగోడు ఎన్నికల్లో గోడవలతో మంగళవారం భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ.. తాజాగా మిమిక్రీలతో ఫేక్ కాల్ రికార్డులు (ఆడియో) తయారు చేసి వాటిని సోషల్ మీడియోలో సర్క్యూలేట్ చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా నకిలీ ప్రచారాన్ని మొదలు పెట్టాయి.
దీనిపై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు హైదరాబాద్ సైబర్‌క్రైమ్, ఉప్పల్ ఠాణాలలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీ గూర్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు ఆయన వాయిస్‌ను మిమిక్రీతో తయారు చేసి, ఆ నకిలీ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలాంటి ఫేక్ ఆడియోలు ఎన్నికల్లో ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు గ్రూప్‌ల మధ్య గొడవలు సృష్టించేందుకు అవకాశముంటుంది. కుట్రపూరితంగా నకిలీ కాల్ రికార్డు వాయిస్‌ను సోషల్‌మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి.