సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్లో మూసివేసిన రోడ్లను ట్రాఫిక్, ఆర్మీ అధికారులు గురువారం పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నగర పోలీసులను ఆదేశించింది. ఇందులో భాగంగానే కంటోన్మెంట్ సమస్యలు కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కంటోన్మెంట్లో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై నగర పోలీసులు దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నివాసముండే ప్రజల అభిప్రాయాలను పోలీసులు సేకరించారు. ఆర్మీ అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం కంటోన్మెంట్ ఆర్మీ అధికారులు బ్రిగేడియర్ సోమ శంకర్, స్టేషన్ ఇన్చార్జి కల్నల్ సిద్ధార్థ్‌తో సమావేశమయ్యారు. గత వారం నగర సీపీ ఆదేశాలతో ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి అధికారుల బృందం ఆర్మీ కంటోన్మెంట్ స్టేషన్ ఇన్చార్జి కార్యాలయాన్ని సందర్శించారు. రోడ్ల మూసివేత, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి చర్యలు, సమస్యలను సామరస్య పూర్వకంగా ఎవరికీ ఇబ్బందులు రాకుండా పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని ఆర్మీ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆర్మీ అధికారులు సీపీ సీవీ ఆనంద్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల రాకపోకలకు ఏ రోడ్లు తెరవచ్చు.?.. సున్నితంగా ఉండే ప్రాంతాలు, అక్కడ తీసుకోవాల్సిన భద్రత పరమైన చర్యలపై కల్నల్ బృందంతో పాటు ట్రాఫిక్ డీసీపీ బృందం కలిసి గురువారం తనిఖీలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అధికారుల పరిశీలన తర్వాత ఏ రోడ్లు తెరువాలనే విషయంపై ఒక నిర్ణయానికి వద్దామని చర్చించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ఏరియాలో సైనిక, రక్షణ సంస్థల భద్రత కూడా కీలకమని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించడం ప్రధానమేనని అన్నారు. ఈ రెండు అంశాలు సమతుల్యంగా ఉండటం అవసరమని తెలిపారు. ఆర్మీ అధికారులు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం వాహనాల రాకపోకలకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని సమీక్షించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.