సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : టౌలీచౌకిలోని నదీంకాలనీ, ఇతర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నందున మిలిటరీ ప్రాంతం లో ఉన్న చెక్‌డ్యామ్‌ను తొలగించి పైపులైన్ వేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం బీఆర్కేభవన్లో సీనియర్ మున్సిపల్ అధికారులు, రక్షణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని మిలిటరీ ప్రాంతం మీదుగా వెళుతున్న బుల్కాపూర్ నాలాకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.
బుల్కాపూర్ నాలా నుంచి రేతిబౌలి వరకు, మూసీ చివరి వరకు జీహెచ్ఎంసీ, ఆర్మీ అధికారులతో సంయుక్తంగా సర్వే నిర్వహించాలని తెలిపారు. మిలటరీ ప్రాంతం నుంచి టౌలిచౌకీ వైపు తుఫాన్ నీటి కాలువను మళ్లించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, బ్రిగేడియర్ సోమ శంకర్, డిప్యూటీ జీఓసీ తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా కల్నల్ సిద్ధార్ధ్ నారాయణ్, సంజయ్ జాజు, అదనపు సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, సీసీపీ దేవేందర్ రెడ్డి, సీఈ దేవానంద్, తదితర అధికారులు పాల్గొన్నారు.