సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నది. ఈ క్రమంలోనే మోడల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు రూ.16.7 కోట్లతో తొలుత మూడు ప్రాంతాలను ఎంపిక చేసిన అధికారులు ప్రతిపాదనలు స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకువచ్చారు.
గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం టెండర్లను పిలిచి పనులు చేపట్టనున్నారు. మూడు నుంచి నాలుగు వరుసల్లో మెయిన్ క్యారేజ్ వే, ఈ మెయిన్ క్యారేజ్ వే మధ్యన సెంట్రల్ మీడియన్, ప్రధాన రహదారికి పక్కన అడుగున్నర మేరలో ఒక వరుసలో గ్రీనరీ, తర్వాత ఫుట్‌పాత్, పక్కనే సైకిల్ ట్రాక్, ట్రాక్ పక్కన ఫుట్‌పాత్ ఉండనున్నది. ట్రాఫిక్ సమస్య శాశ్వత నియంత్రణతో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలువనున్నది.
మూడు మోడల్ కారిడార్లు హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ జంక్షన్ నుంచి ఐటీ హైట్ రోడ్, బయోడైవర్సిటీ నుంచి లెథర్ ఇనిస్టిట్యూట్, ఐటీ హైట్ రోడ్స్ నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు మోడల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.16.7 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మూడు కారిడార్లతో పాటు వీటి పకనే ఆరు మీటర్ల సర్వీస్ రోడ్డు, 1.8 మీటర్ల మేర సైకిల్ ట్రాక్‌ను కూడా జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనున్నారు.