మేడ్చల్, అక్టోబర్ 31: ఆదివారం అర్ధరాత్రి ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తు కారణంగా ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి సమీపంలోని ఓఆర్ఆర్పై ఎగ్జిట్ నంబర్.5, 6ల మధ్యన చోటుచేసుకున్నది. అయితే బాధితులంతా సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు.
సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, మెదక్ జిల్లా చిట్కుల్, కౌడిపల్లి ప్రాంతాలకు చెందిన శంకర్ గుప్త, సురేశ్ గుప్త, నరేందర్ గుప్త కుటుంబాలు కార్తీక మాసం పురస్కరించుకొని దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నరేందర్ గుప్త, సురేశ్ గుప్తల కుటుంబాలు గుమ్మడిదలలో ఉండే శంకర్ గుప్త ఇంటికి శనివారం రాత్రి చేరుకున్నాయి. అక్కడి నుంచి నర్సింహ రెడ్డికి చెందిన వింగర్‌లో ముగ్గురు కుటుంబాలకు చెందిన 11మంది ఆదివారం ఉదయం తెల్లవారుజామున శ్రీశైలం వెళ్లారు. దైవదర్శనం అనంతరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుగుపయనమయ్యారు.
తుక్కుగూడ వద్ద ఔటర్ రింగురోడ్డు ఎక్కారు. మరో 20 నిమిషాల్లో దుండిగల్ ఎక్జిట్ నం.5 వద్ద ఓఆర్ఆర్ దిగి గుండిదలకు చేరుకుంటారు. అప్పటికే అర్ధరాత్రి 12 కాగా అందరూ గాడ నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్పై గౌడవెల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి బాధితుల వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వింగర్ వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్ నర్సింహ రెడ్డి(32)తో పాటు ముందు సీట్ల కూర్చున్న శంకర్‌గుప్త(46), సురేశ్ గుప్త(47)లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మధ్య సీటులో కూర్చొన్న రూప, సంధ్యలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. లావణ్య, శశికిరణ్, భవిత, విఘ్నేశ్, నరేందర్‌లకు తీవ్ర గాయాలు కాగా దవాఖానకు తరలించారు. విజ్ఞయ్యకు స్వల్ప గాయాలు కాగా, అశ్వికకు ఎలాంటి గాయాలు కాలేదు.
నిద్రమత్తులో..
గుమ్మడిదలకు చెందిన నర్సింహ రెడ్డి వింగర్ను కొనుగోలు చేసి, తానే డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు స్థానికంగా ఉన్న కంపెనీకి ఉద్యోగులను చేరవేస్తూ ఆదివారం మాత్రం సెలవులో ఉంటాడు. శంకర్ గుప్త ఆదివారం ఉదయం శ్రీశైలంకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి వచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో తిరిగి వస్తుండగా నిద్రలేమితో ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తున్నది. శంకర్‌గుప్త, సురేశ్ గుప్తలు స్థానికంగా కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కౌడిపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన నరేందర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బీరంగూడలో తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. రెండు కుటుంబాల పెద్దలు మృత్యువాతపడటంతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
క్షతగ్రాతులు ఆస్పత్రికి తరలింపు
సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహరెడ్డి, బాలానగర్ ఎన్ఎస్వో సైదులు తన సిబ్బందితో హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. గాయపడిన వారిని సికింద్రాబాద్ యశోధ దవాఖానకు తరలించారు.