సికింద్రాబాద్, అక్టోబర్ 31; సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న పేదల కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. సీఎం కేసీఆర్ 2017 మార్చిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి 2022 అక్టోబర్ నాటికి కంటోన్మెంట్ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 5వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. దళారుల ప్రమేయం, నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఇంటికి చెక్కులు అందిస్తుండంతో లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండాపోతున్నాయి. లక్షా నూట పదహారు రూపాయలు సర్కార్ ఉచితంగా అందిస్తుండడంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడంతోపాటు, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండాపోతుంది. వివాహమైన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మంజూరైన చెక్కులను వారానికోసారి ఎమ్మెల్యే జి. సాయన్న స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
లబ్ధిదారుల వివరాలు
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో సగభాగం ఉంటుంది. ఎనిమిది వార్డులు, మోండా డివిజన్ల్లో నేటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 4,534 కుటుంబాలు ప్రయోజనం పొందాయి. పథకం ప్రారంభంలో ఆడపిల్ల పెళ్లికి గాను సర్కార్ రూ.51 వేలు అందించగా, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని రూ.75 వేలకు పెంచింది. కొద్దిరోజుల్లోనే తిరిగి 1లక్షా116 రూపాయల చొప్పున సర్కార్ సాయం చేస్తున్నది.
పేదింటి పెద్దకొడుకు సీఎం కేసీఆర్
నిరుపేద కుటుంబానికి పెద్దకొడుకుగా బాధ్యత తీసుకొని ఆడపిల్ల పెళ్లికి సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నారు. అయినవాళ్లే ఆర్థిక సాయం చేయమంటే ఆమడదూరం పోతున్న ఈ రోజుల్లో .. తెలంగాణ సర్కార్ ఈ పథకం పెట్టి ఆదుకోవడం సంతోషంగా ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు లేకుంటే ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడేవి. సర్కారు పేద కుటుంబాలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తుంది.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్