బండ్లగూడ, అక్టోబర్ 31: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గ్రామ, గ్రామానా, వాడ, వాడలా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ, పార్క్‌లు, రోడ్లతో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల 40 లక్షల రూపాయల నిధుల విడుదలకు కౌన్సిల్లో తీర్మానం చేశారు. అనంతరం మేయర్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని బస్తీలలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. ప్రజలకు ఏ విధమైన సమస్య ఉన్నా తమకు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.