కొండాపూర్, అక్టోబర్ 31 : వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతూనే ఉన్నదని చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు సరికొత్తగా అందిస్తున్న రెండు డెబిట్ (ఓప్పులియెన్స్, షప్పిర్) కార్డులను సోమవారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల షాపింగ్, హెల్త్, మార్కెటింగ్, క్రీడా విభాగాల్లో వినియోగదారులకు మరిన్ని సేవలందించేలా డెబిట్ కార్డుల పనితీరు ఉంటుందన్నారు. ప్రతి షాపింగ్‌లో డిస్కౌంట్లను అందించేలా ఈ సరికొత్త డెబిట్ కార్డులు పని చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సుధాంష్ కుమార్ సింగ్, జోనల్ హెడ్ మన్మోహన్ గుప్త, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.