సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: మురుగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జలమండలి ఎండీ దానకిశోర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపైన విచారణ జరపాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పలు బస్తీల్లో పర్యటించారు. బస్తీల్లో నీటి సరఫరా, నాణ్యత, సీవరేజి నిర్వహణ, రిజర్వాయర్ లెవల్ మానిటరింగ్‌ను స్వయంగా పరిశీలించారు. తొలుత షేక్ పేటలోని ఓయూ కాలనీ పర్యటనకు దాన కిశోర్ వెళ్లిన సమయంలో ప్రధాన రహదారిపైన మురుగు ప్రవహిస్తున్నది. ఇది గమనించిన ఎండీ షేక్ పేట్ సబ్ డివిజన్ డీజీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సీవరేజి ముందస్తు నిర్వహణ చర్యల కోసం ఎయిర్ టెక్ మిషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇందుకు అవసరమైన బడ్జెట్ సైతం కేటాయించినా నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన మండిపడ్డారు. అనంతరం ఎండీ దానకిశోర్ షేక్‌పేటలోని రిజర్వాయర్‌ను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్ లైన్ రిజర్వాయర్ వాటర్ లెవల్ మానిటరింగ్ సిస్టమ్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన జలమండలి డివిజన్-6 పరిధిలోని బంజారాహిల్స్ దూద్ ఖానా బస్తీలో పర్యటించారు. బస్తీలోని ప్రజలతో మాట్లాడి తాగునీటి సరఫరా ఎలా జరుగుతున్నదని అడిగి తెలుసుకున్నారు. సీవరేజి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమం సీజీఎం ప్రభు, జీఎంలు హరిశంకర్, నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు.