మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 14: నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. ‘గో డిజిటల్ – గో సెక్యూర్’ అనే అంశంతో 2020-2025వ సంవత్సరం వరకు దేశం మొత్తం ఆర్ధిక లావాదేవీలను డిజిటల్ ట్రాన్సాక్షన్ల ద్వారా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి లావాదేవీలపై అవగాహన కల్పించి ఆర్థిక అక్షరాస్యులను చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి ప్రతి ఒక్కరు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్న సంకల్పంతో రిజర్వు బ్యాంక్ ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు పైనాన్సియల్ లిటరసీ వారోత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం, అందుకు సంబంధించిన కరపత్రాలను లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కిశోర్ కుమార్, అదనపు కలెక్టర్ శ్యాంసన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఏజీఎం వీకే యాదవ్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణం, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా బ్యాంకుల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.