ఖైరతాబాద్, అక్టోబర్ 22 : నెక్లెస్‌రోడ్‌లో శనివారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వాక్‌ను నిర్వహించారు. ఈ వాక్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం 33 జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి పాల్గొన్నారు.
రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం 33 జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శనివారం ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజినల్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో డైరెక్టర్ డాక్టర్ జయలత నేతృత్వంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వాక్‌ను నెక్లెస్‌రోడ్ పీవీ మార్గ్‌లోని జలవిహార్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ వాక్‌ను మంత్రి హరీశ్ రావు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల్లో అవగాహన పెరగాలని, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మామోగ్రామ్ పరీక్ష చేసుకోవడం ద్వారా ప్రాథమిక దశలో గుర్తిస్తే వంద శాతం నివారించవచ్చన్నారు.
70 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే దవాఖానలకు వస్తున్నారని, తద్వారా 50 శాతం మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచాలని అక్టోబర్ నెలను క్యాన్సర్ అవేర్నెస్ నెలగా గుర్తించి అనేక ర్యాలీలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారని ఆయన ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జిల్లాల్లో ప్రీ డయాగ్నిస్టిక్ సర్వీసెస్ ద్వారా మామోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు. క్యాన్సర్ నివారణ కోసం ఎంఎన్‌జే దవాఖానలో 450 నుంచి 750 పడకలకు పెంచుతున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.120 కోట్లతో ఎంఎన్జేలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ రూపొందించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఎంఎన్జేలో ఈ నెల 31వ తేదీ వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని డా.జయలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శశికళ, ఎంఎన్‌జే ఆర్ఎంవో డాక్టర్ నిర్మల సర్దార్, ఆఫీస్ సూపరింటెండెంట్ సుధాకర్ పాల్గొన్నారు.