బొల్లారం,అక్టోబర్ 22: కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరవాలంటూ..టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బొల్లారం రైతు బజార్ నుంచి లక్డావాల రోడ్డు వరకు స్థానికులు, బోర్డు సభ్యులు నిరసన తెలిపారు.
కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరువాలని మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి బొల్లారం రైతు బజార్ నుంచి లక్డావాల రోడ్డు వరకు స్థానికులు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సభ్యులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..బొల్లారం,లక్డావాల,అమ్ముగూడలో మిలటరీ అధికారులు మూసివేసిన రోడ్లను వెంటనే తెరిపించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇంతకు ముందే మూసివేసిన రోడ్లకు ఇప్పుడు మూసివేస్తామని నోటీసులు ఇవ్వడం విడూరమన్నారు. స్థానిక ప్రజలకు అభ్యంతరం ఉంటే 21 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని,నోటీసులు ఇవ్వడం మోసపూరితమైన చర్య అని విమర్శించారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు అధికారులు మూసివేసిన రోడ్లు తెరువాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు లోక్‌నాథ్, యాదవ్, ప్రభాకర్, నళిని, శ్యామ్‌కుమార్, ఎచ్ఎన్, శ్రీనివాస్, శివ, చందర్, జితేందర్ పాల్గొన్నారు.