సైదాబాద్, అక్టోబర్ 22 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి పోలీసు శాఖ ప్రయత్నాలు చేస్తున్నదని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట లక్ష్మీగార్డెన్‌లో ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ కంపెనీల సహాయంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి జాబ్ మేళాను పోలీసు శాఖ నిర్వహిస్తున్నదని తెలిపారు. నిరుద్యోగ యువత మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొనగా, ఎనిమిది వందల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారని తెలిపారు. వారిలో 300 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. మలక్‌పేట ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు చేస్తున్న సేవల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. టీఎంఐ సంస్థ సౌజన్యంతో ఇప్పటి వరకు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్నామన్నారు. ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఐ బిజినెస్ యూనిట్ హెడ్ రజనీ, సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె. సుబ్బరామిరెడ్డి, ఎస్ఐలు హరికృష్ణారెడ్డి, టీఎంఐ ప్రతినిధులు కృష్ణ, సందీప్ పాల్గొన్నారు.
ఉద్యోగం కోసం.. చంటి బిడ్డతో..
నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాపను మా అమ్మవద్ద ఉంచి, బాబును తీసుకొచ్చాను. ఐటీఐ చదువుకున్నాను. ఉద్యోగ మేళా ఉన్నట్లు పేపర్లో చూశాను. నా భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐటీఐ చదివాను. నేను కూడా ఉద్యోగం చేయాలనుకున్నాను. అందుకే జాబ్ మేళాకు వచ్చాను. కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూ చేశారు. అనుకూలమైన ఉద్యోగం ఇస్తామని కంపెనీల నిర్వాహకులు చెప్పారు. వారి పిలుపు కోసం ఎదురు చూస్తాను. – సుగుణ, ఇంజాపూర్
ఉద్యోగ.. విజేత
ఉద్యోగ మేళాకు మొదటిసారి వచ్చాను. ఏఎన్జీ ఇన్ప్రొ టెక్ కంపెనీలో జాబ్‌కు సెలెక్ట్ కావడం సంతోషంగా ఉంది. బీ.కాం మూడో సంవత్సరం చదువుతున్న నాకు జాబ్ వస్తుందని ఊహించలేదు. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా ఉద్యోగానికి ఎంపిక కావడంతో మరింత బాధ్యత పెరిగింది. ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసిన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు- విజేత, బి.కాం (విద్యార్థి), ఉప్పల్