గోల్నాక, అక్టోబర్ 22 : నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులను ఆదేశించారు. శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న రహదారులు, పార్కుల అభివృద్ధి, మంచినీటి, డ్రైనీజీ పైపులైన్ల పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసికొని నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలో కొత్తగా ప్రతిపాదించిన పనుల నిర్మాణాలకు అంచనా వ్యయాన్ని సిద్ధం చేయాలన్నారు. అంతే కాకుండా పనుల చేపడుతున్న సమయంలో ప్రజలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మంచినీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ కలుషిత మంచినీటి సమస్యతో పాటు లోప్రెషర్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, రవి, జలమండలి ఏఈ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
మాలిక్ సొంత గూటికి చేరడం శుభపరిణామం..
ప్రభావిత క్రియాశీల నేత మహ్మద్ అబ్దుల్ మాలిక్ తిరిగి సొంత గూటికి చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కొన్నేండ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న అంబర్‌పేటకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, టీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ అబ్దుల్ మాలిక్ గత శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి గులాబీ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మాలిక్‌ను పూలమాలతో సన్మానించి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడ గలిగే నేత సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. మాలిక్ వెంట టీఆర్ఎస్ నాయుడు లింగారావు ఉన్నారు.