బండ్లగూడ, అక్టోబర్ 22: పెరుగుతున్న జనాభాకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో అనేక కాలనీలు ఏర్పడటంతో ప్రజలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రోడ్లు చిన్నవిగా ఉండటం తో ప్రజలు రాకపొకలకు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 350 కోట్లతో రోడ్ల విస్తరణ పనులను మొదలు పెట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తుంది.
నగరాన్ని ఆనుకుని ఉన్న బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కిస్మత్పూర్, బండ్లగూడ, హైదర్సాకోట్, పీరం చెరువు, బైరాగిగూడ, గంధంగూడ, దర్గాఖలీజ్‌ఖాన్, హిమయాత్సాగర్తో పాటు అనేక కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో నూతన రోడ్ల వేసేందుకు ప్రతిపాదించింది. వాటి అమలుకు ఇటీవల అధికారులు సర్వేలు కూడా నిర్వహించారు.
పూర్తయిన టెండర్లు…
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఏడు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేసేందుకు టెండర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.కిస్మత్పూర్ నుంచి బండ్లగూడ చౌరస్తా వరకు,కిస్మత్పూర్ నుంచి ప్రస్టేజీ విలా హిమాయత్‌సాగర్ రోడ్డు వరకు,కిస్మత్పూర్ నుంచి దర్గా ఖలీజ్‌ఖాన్ మీదుగా ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్‌రోడ్డు వరకు,పర్మయిస్ హోటల్ నుంచి హైదర్షాకోట్ మీదుగా ఇబ్రహీంబాగ్ వరకు, కేంద్రీయ విహార్ నుంచి నార్సింగి వరకు, ఫిబల్సిటీ నుంచి నార్సింగి రోడ్డు, పీఅండ్‌టీ కాలనీ నుంచి సన్‌సిటీ వరకు వివిధ రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ దశ దిశ మారనుంది.
చిన్న రోడ్లతో ఇబ్బందులు పడిన ప్రజలు అధికారులు రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.