సిటీబ్యూరో, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): “కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నగరవాసులు దీపావళి సంబురాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో నగరవాసుల్లో పాత జోష్ వచ్చింది. ఈసారి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా పండుగకు నాలుగైదు రోజుల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దసరా, సంక్రాంతి పండగలకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసులు ఎప్పటిలాగే ఈసారి కూడా దీపావళిని ఇక్కడే ఉండి సంబురంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పండుగకు వారం రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. గతం కంటే ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నప్పటికీ తగ్గేదేలే.. అన్నట్లుగా కొనుగోలు దారుల్లో మాత్రం ఆసక్తి తగ్గకపోవడంతో టపాసుల దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.” మార్కెట్లో లభిస్తున్న తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, కాకరవత్తులు, 1000 వాలా, 2000 వాలా వంటి అనేక టపాసుల ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి.
మట్టి ప్రమిదలకు భలే గిరాకీ
సైజును బట్టి డజన్ ప్రమిదలను రూ.50 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ధనలక్ష్మి పూజకు సంబంధించిన దొంతులకు సైతం డిమాండ్ పెరిగింది. వెరైటీని బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు మహిళలతో సందడిగా మారాయి.
ఆ రెండు గంటల్లోనే టపాసులు కాల్చాలి
ఈసారి దీపావళి పండగ సందర్భంగా బాణాసంచాలను కాల్చడానికి సంబంధించి దుకాణదారులు, ప్రజలకు జీహెచ్ఎంసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. టపాసులను ఎప్పుడు కాల్చాలి? ఎలాంటి బాణాసంచాలను అమ్మాలన్న వివరాలతో నిబంధనలను విడుదల చేసింది. ఆ ప్రకారంగా.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
కొనుగోళ్లు పెరిగాయి
గత ఏడాదితో పోలిస్తే ఈసారి టపాసుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. 90 శాతం టపాసులు పర్యావరణానికి హానికరం కలిగించని వాటినే తయారు చేయగా.. కొనుగోలుదారులు సైతం వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. జీఎస్టీ వల్లనే టపాసుల ధరలు పెరిగాయి. కొనుగోళ్లపై ఈ ప్రభావం ఏమాత్రం లేదు.
– సంజయ్ భూపే, శాంతి ఫైర్ వర్క్స్ యజమాని
గిరాకీ బాగుంది..
గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది టపాసులకు గిరాకీ పెరిగింది. వారం రోజుల ముందు నుంచే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అబిడ్స్‌లోని హోల్‌సేల్ దుకాణం నుంచి కొనుగోలు చేసి ఉప్పల్‌లో రిటైల్‌గా విక్రయిస్తున్నా. రేట్ల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు. పండుగ నాటికి టపాసుల కొనుగోళ్లు మరింతగా పెరుగనున్నాయి.
– రవి, రిటైల్ వ్యాపారి, ఉప్పల్ వాసి
2వేల టపాసులు కొన్నాం..
టపాసుల రేట్లు ఈసారి బాగా పెరిగాయి. రేట్లు ఎంతున్నా.. ఇంట్లో పిల్లల గొడవకైనా టపాసులను కొనాల్సిన పరిస్థితి. గత యేడాది వెయ్యి రూపాయలకే కవర్ నిండా టపాసులు వచ్చేవి. ఈసారి ఆ పరిస్థితి లేదు. రూ.2వేలు పెట్టినా కవర్ టపాసులు రావడం లేదు. రెండేళ్లుగా పండగను సరిగా చేసుకోలేకపోయాం. ఈసారి జోష్‌గా చేసుకోవాలనుకున్నాం. కాబట్టి రేట్లు ఎలా ఉన్నా..కొనుగోలు చేయాలనుకుని రూ.2వేల టపాసులను కొనుగోలు చేశాను.
– ఎస్.లక్ష్మి, ఫిలింనగర్ వాసి