కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 20 : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు ఓవైపు.. పటాకుల మోతలు మరోవైపు వినిపిస్తుంటాయి. దీపావళి పటాకులు కావాలంటే సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. గతంలో ఎక్కడపడితే అక్కడ పటాకుల దుకాణాలు అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసేవారు. కానీ.. ఈ యేడాది అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలుంటాయని జీహెచ్ఎంసీ, ఫైర్, పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. పటాకుల దుకాణాల ఏర్పాటుకు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే ఒక్కరోజులోనే అనుమతులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలు, పటాకులను సీజ్ చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
నిబంధనలు తప్పనిసరి…
పటాకుల దుకాణం ఏర్పాటు చేసినవారు కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఖాళీ ప్రదేశాలలో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క దుకాణానికి మూడు మీటర్ల దూరం ఖాళీ ప్రదేశముండాలని, షాపులలో మంటలు చెలరేగకుండా ఉండేందుకు పైకప్పుతో పాటు మూడు పక్కల సిమెంట్ రేకులను ఉపయోగించాలి. విద్యుత్ ప్రమాదం తలెత్తకుండా విద్యుత్ తీగలు, వ్యవస్థను ఏర్పాటు చేసుకొని స్థానిక విద్యుత్ కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. అగ్నిప్రమాదం తలెత్తితే వెంటనే మంటలు ఆర్పేలా ప్రతీ షాపులో ఫైర్ ఎగ్జాస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క షాపు వద్ద 200 లీటర్లు సామర్థ్యం కలిగిన డ్రమ్ములను పెట్టుకుని వాటిని నీటితో నింపి ఉంచాలి. నాలుగు బకెట్లు అందుబాటులో పెట్టుకుని రెండింటిలో నీరు, రెండింటిలో ఇసుకను పెట్టుకోవాలి. నాసిరకం టపాకులు కాకుండా నాణ్యమైన వాటిని నిర్దేశిత ధరలకు మాత్రమే విక్రయించాల్సి, ట్రాన్స్ఫార్మర్ల పక్కన, హోటళ్ల వంటశాలల పక్కన పొగతాగే ప్రాంతాలలో దుకాణాలను ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది.
అనుమతి ఇలా…
దీపావళి పటాకుల దుకాణం ఏర్పాటుకు ముందుగా డీసీపీ కార్యాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్, డివిజినల్ ఫైర్ స్టేషన్, జీహెచ్ఎంసీ కార్యాలయాలలో ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులలో పేర్కొన్న స్థలాలను ఆయా విభాగాల అధికారులు పరిశీలించిన తర్వాత నిబంధనల మేరకు అనుమతులను జారీ చేస్తారు. ప్రైవేట్ స్థలంలో పటాకుల దుకాణం పెట్టాలనుకుంటే సంబంధిత యజమానితో అనుమతి పత్రం కావాలి. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినా అనుమతి కావాల్సిందే. చుట్టుపక్కల ఇండ్లకు ఎలాంటి ప్రమాదం లేని ప్రదేశాలోని దుకాణాలను ఏర్పాటు చేయాలాల్సి ఉంటుంది. గతంలో దుకాణాల ఏర్పాటు అనుమతి పత్రం ఉన్నవారు జిరాక్స్‌ను దరఖాస్తుతో కలిపి ఇస్తే అనుమతులు సులభంగా వస్తాయి.
ఒక్కరోజులోనే అనుమతిస్తాం..
పటాకుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే ఒక్కరోజులోనే అనుమతి ఇస్తాం. ఎస్బీఐ గన్ఫ్రౌండ్రీ పేరున రూ.500 చెల్లించి రసీదు పత్రాన్ని జతపరిస్తే వెంటనే వాటిని పరిశీలించి అనుమతులను జారీ చేస్తాం. నిబంధనలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే అనుమతి ఉండదు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇస్తాం. జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్ శాఖల అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి మియాపూర్ వరకు, కేపీహెచ్‌బీ కాలనీ మూసాపేట రైల్వే లైన్ పరిధిలో, నిజాంపేట బాచుపల్లి, ప్రగతినగర్, ఎల్లమ్మబండ, ఆల్విన్‌కాలనీ ప్రాంతాలలో దుకాణాలు ఏర్పాటు చేసేవారు కూకట్పల్లి ఫైర్ స్టేషన్లో అనుమతులు పొందాలి.
– వై.సైదులు, ఏడీఎఫ్‌వో, కూకట్పల్లి