మేడ్చల్, అక్టోబర్ 17: గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ విద్యార్థులతో కలిసి సోమవారం మేడ్చల్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు యాదవ్ మాట్లాడుతూ గతంలో పూడూరు గ్రామానికి వచ్చే పలు సర్వీసులను రద్దు చేయడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రద్దు చేసిన బస్సులు తిరిగి పునరుద్ధరించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించామన్నారు.
అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్టు తెలిపారు. పూడూరు చౌరస్తా మీదుగా వెళ్లే బస్సులు గ్రామం మీదుగా వెళ్లాలని, విద్యార్థుల సమయానికి అనుకూలంగా సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యు లు శశికుమార్ యాదవ్, మాణిక్యం, శ్రీకాంత్, నాగేశ్, మహేందర్, లక్ష్మణ్ యాదవ్, అజయ్ యాదవ్ పాల్గొన్నారు.