సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణలు, క్యారేజ్ వేలపై అడ్డదిడ్డమైన వాహనాల పార్కింగ్‌ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న రోప్ (రిమూవల్ అబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెట్) తరహాలోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తీరు మార్చుకోని వారిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 375 వ్యాపార సముదాయాలకు నోటీసులు జారీ చేశారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దు :రాచకొండ ట్రాఫిక్ డీసీపీ, శ్రీనివాస్
వ్యాపార సముదాయాల వద్దకు వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యాన్ని ఆయా సంస్థలు కల్పించాలి. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయ వద్దు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు ప్రజలు పూర్తి సహకారం అందించాలి. ప్రజల సహకారం, సమన్వయంతోనే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో రోడ్లపై సాఫీగా ప్రయాణం సాగుతుంది.
కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో ఫుట్‌పాత్‌లు ఖాళీ చేయిస్తున్నారు. కొందరు పాదచారులు వెళ్లేందుకు నిర్మించిన ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించడం, రోడ్లకు ఇరువైపులా అక్రమ పార్కింగ్తో ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తెస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది.