ఎర్రగడ్డ, అక్టోబర్ 16: అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలతో పబ్బం గడుపుకొనే స్థితికి బీజేపీ దిగజారిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. బోరబండ డివిజన్ ఎన్ఆర్ఆర్ పురం సైట్-3 కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాగంటి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారీ వర్షాల సమయాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్చిపోవటం సహజమేనన్న ఇంకిత జ్ఞానం కూడా లేని బీజేపీ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల బోరబండలో కురిసిన అతి భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం అరగంట పాటు నీరు నిల్చిపోతే ఆ పార్టీ వాళ్లు అనవసర రాద్ధాంతాలకు దిగటం తెలివితక్కువ తనమన్నారు. సైట్-3 సంక్షేమ సంఘం వారి కోరిక మేరకు కాలనీలో తాగునీటి పైప్లైన్, సీసీ రోడ్లు, సీవరేజీ పైప్లైన్ పనులకు నిధులు కేటాయింపజేసి సదరు పనులను పూర్తి చేయటం జరిగిందని వివరించారు. సంక్షేమ సంఘాలు ఐక్యతగా ఉంటూ అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఎన్ఆర్ఆర్ పురం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఇండ్ల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అంశం త్వరలో సఫలం కానున్నదని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, సైట్-3 అధ్యక్షుడు గౌస్, ఏడీ మధు, సయ్యద్ ముక్రమ్, తిరుపతయ్య, సునీల్, గఫార్, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్తార్, యూసుఫుద్దీన్, సత్తాజీ, యూసుఫ్, ఫయాజ్ఖాన్, వెంకటేష్, రాములు ముదిరాజ్, కవిత, సరళ, బాబానాయక్ తదితరులు పాల్గొన్నారు.