సిటీబ్యూరో,అక్టోబర్ 15( నమస్తే తెలంగాణ ) ;వీకెండ్లో టూర్లకు సై అంటున్న నగరవాసులు ఆనంద శిఖరాలను చేరుకునేలా విహారయాత్రలుఒక్కరోజు చుట్టొచ్చే పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. ఉరుకులు..పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లూ.. ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితోసతమతమయ్యే ఉద్యోగులు.. కాసేపు ప్రకృతి ఒడిలోఓలలాడుతున్నారు. మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లువేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లక్నవరం సరస్సు..
నగర పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన వాటిల్లో లక్నవరం ఒకటి. హైదరాబాద్ నుంచి 220 కిలో మీటర్లు. ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరునాగారం అభయారణ్య సందర్శకులను కనువిందు చేస్తున్నది. లేక్ క్రాసింగ్, రోప్ కోర్సులు, కయాకింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి. దీనికి సమీపంలో బొగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతం.
శామీర్‌పేట్ లేక్..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్‌పేట్ సికింద్రాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జింకల పార్క్‌లో జింకలతో పాటు నెమళ్లు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి.
అబ్బురపరిచే పార్కులు..
హైదరాబాద్ శివారులోనే ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కును అడవిలాంటి ఉద్యాన వనం అనవచ్చు. అటవీశాఖ 75 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ పార్కులో 50 వేల పైచిలుకు చెట్లున్నాయి. పెద్దల కోసం యోగా హాల్, వాక్‌వేలు ఉన్నాయి. పిల్లలకు ఆట స్థలాలున్నాయి. ట్రీహౌస్, పక్షులు సీతాకోకచిలుకల పార్కులు ఉన్నాయి. కుటుంబమంతా కలిసి పిక్నిక్ వెళ్లడానికి చక్కని చోటు ఇది. అలాగే కొత్తగూడలో 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఆహ్లాదాన్ని పంచుతున్నది.
శ్రీశైలం..
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. హైదరాబాద్ నుంచి 5 గంటల ప్రయాణం. సుందరమైన దృశ్యాలకు నెలవు. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్టను వీక్షించొచ్చు. అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటి. నది ఒడ్డున ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించొచ్చు. భ్రమరాంబదేవి , సాక్షి గణపతి దేవాలయాలున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించొచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులే కాదు.. నగరానికి చేరువలో అనేక జలపాతాలున్నాయి. అందులో బొగత, నిర్మల్ జిల్లాలో కుంటాల, పొచ్చర వంటివి ఉన్నాయి.
సిటీ చుట్టూ థీమ్‌లు..
ఓఆర్ఆర్ నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా ఉన్న థీమ్ పార్కులు పర్యాటకులకు ఎంతగానో చేరువయ్యాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం. 13 వద్ద అందుబాటులో ఉంటే వండర్ లా, శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఎస్కేప్ అడ్వెంచర్ వాటర్ థీమ్ పార్కు, శంకర్‌పల్లిలోని వైల్డ్ వాటర్ అమ్యూజ్మెంట్, వికారాబాద్ సమీపంలో ఉండే డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్కులు, వికారాబాద్, భువనగిరి గుట్టల సమీపంలో ఉండే ట్రెక్కింగ్ స్పాట్లకు ప్రైవేటు టూర్ ఆపరేటర్లతోపాటు తెలంగాణ టూరిజం శాఖ కూడా టూర్లను ఆపరేట్ చేస్తున్నది. వీటికి సిటీ నుంచి గంటన్నర వ్యవధిలోనే చేరుకునే వీలు ఉండగా.. ఒకప్పుడు సిటీ దాటి వెళ్లేవారు కూడా ఈ ప్రాంతాలను ఒక్కసారైన సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అనంతగిరి
ట్రెక్కింగ్ కోరుకునే వారికి అనంతగిరి స్వర్గధామం. వికారాబాద్‌కు కేవలం పది కిలోమీటర్లు.. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి కొండల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం.. నిర్మలమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది.ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.
కీసరపోదాం..
ఆధ్యాత్మిక ప్రాంతంగా పరిఢవిల్లుతున్న కీసర.. పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి. పక్షుల కిలకిలరావాలు..‘హరితహారం’తో స్వాగతం పలికే చెట్లు.. సుందరీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న చెరువులు.. నలువైపులా వీక్షించేలా కొండపై కొలువుదీరిన వ్యూ పాయింట్స్.. అచ్చు ప్రకృతి సంపదతో నిర్మించినట్టుగా అనుభూతి కలిగించే ఆర్నమెంటల్ ఫెన్సింగ్.. ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కల కూడళ్లు.. నలువైపులా పరుచుకున్న పచ్చదనంతో కీసర.. పర్యాటకుల డెస్టినేషన్ లిస్టులో మొదటివరుసలోకి చేరింది. సుమారు 1562 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
శ్రీరాం సాగర్..
హైదరాబాద్ నుంచి 207 కిలోమీటర్ల దూరం. సుమారు 4గంటల జర్నీ. ఉత్తర తెలంగాణ జిల్లాకు వరప్రదాయిని. గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మసీద్, కందకూర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, అలీసాగర్ తదితర పర్యాటక ప్రాంతాలన్నింటినీ వీక్షించొచ్చు.
నల్లమల అడవులు..
నగరం నుంచి 219 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో క్యాంపింగ్ చేయడం ఎంతో కిక్కిస్తుంది. ప్రకృతివనంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో పర్యాటకుల సాహసాలను, ఉత్కంఠభరితమైన కార్యకలాపాలను ఆస్వాదించొచ్చు. సాహస భరిత అనుభూతిని పొందేందుకు సరైన డెస్టినేషన్ ఇది. పర్వతారోహణ, శివాలయం, కంబం సరస్సు అందుబాటులో ఉండే ప్రాంతాలు.