అమీర్‌పేట్, అక్టోబర్ 15 : జెక్కాలనీ నివాసితుల అవసరాల కోసం స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కాలనీలోని 2.4 వేల గజాల వక్ఫ్ స్థలాన్ని శనివారం ఉదయం వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్, సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. కాలనీవాసుల అవసరాల నిమిత్తం ఈ స్థలాన్ని లీజు పద్ధతిపై కేటాయించేలా చూస్తానన్నారు. అనంతరం కాలనీలోని గాంధీ చౌరస్తాలో కాలనీ నివాసితులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, బాలానగర్ డీసీపీ సందీప్ సహా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆదివారం ఎర్రగడ్డ అంగడిలో జరిగే పశువుల అమ్మకాలు కాలనీలోకి చొచ్చుకువస్తున్న తీరు పట్ల కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి తలసాని స్పందిస్తూ అంగడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సనత్‌నగర్ ప్రధాన రహదారిపై నిర్మితమవుతున్న మల్టీప్లెక్స్ థియేటర్, షాపింగ్ మాల్‌కు సంబంధించి జెక్కాలనీ వైపు గేటును అనుమతించవద్దంటూ స్థానికుల నుండి వచ్చిన అభ్యర్థనకు మంత్రి స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఏసీపీ రమేశ్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జెక్కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు జి.సూర్యశంకర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ మల్లు ప్రసాద్ పాల్గొన్నారు.