సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణపై దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు దృష్టి సారించారు. జంట నగర వాసులకు ప్రాణవాయువును అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సికింద్రాబాద్‌లోని నార్త్ లాలాగూడలోని శాంతి నగర రైల్వే కాలనీలో కూడా మియావాకీ ప్లాంటేషన్ చేపట్టారు. ఈ పనులు దశలవారీగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే లాలాగూడలోని 5400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్ చేపట్టాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న ఎస్సీఆర్ శనివారం నాటికి 4300 చదరపు మీటర్లలో మొక్కలు నాటే కార్యక్రమం ముగిసినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలోనే ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ‘సే ట్రీస్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరంలో మొక్కల పెంపకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీఆర్ ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ రైల్వే అధికారులను అభినందించారు.
పిల్లల పార్కు ప్రారంభం..
సికింద్రాబాద్‌లోని సౌత్ లాలాగూడలోని రైల్వే కాలనీలో ఎస్సీఆర్ జోన్ ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ శనివారం చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.