సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్షిప్ ముసుగులో గిఫ్ట్‌ల పేరుతో యువతులను బురిడీ కొట్టించి, లక్షలు కాజేస్తున్న ఒక నైజీరియన్తో పాటు ఘనా దేశస్తుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లోలో అరెస్టు చేశారు. నగర సైబర్ క్రైం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ జాయింట్ కమిషనర్ కేసు వివరాలను వెల్లడించారు. ఘనా దేశానికి చెందిన ఎల్లోట్ పీటర్ అలియాస్ చిబుజ, నైజీరియా దేశానికి చెందిన రొమాన్స్ జోషువలు స్టూడెంట్ వీసాపై ఇండియాకి వచ్చి ఢిల్లీలో మకాం పెట్టారు. నకిలీ ఐడీలతో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో అకౌంట్లు తెరిచి యువతులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఈ క్రమంలో ఎల్లోట్ పీటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ లియోన్ పేరుతో బేగంపేటకు చెందిన ఒక యువతికి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు. దీనికి ఆ యువతి స్పందించడంతో తనను తాను యూఎస్‌కు చెందిన డాక్టర్‌గా పరిచయం చేసుకుని 7622377073 నంబర్‌తో వాట్సాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించాడు.
ఆ యువతితో స్నేహం చేస్తునట్లు నటించిన పీటర్ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఒక గిఫ్ట్ పంపుతున్నానని, అందులో బంగారు నగలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో పాటు కొంత నగదు ఉన్నట్లు నమ్మబలికాడు. రెండు మూడు రోజుల తరువాత మరో వ్యక్తి యువతికి ఫోన్ చేసి, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి క్టస్టమ్స్ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడు. “మీకు ఒక పార్సెల్ వచ్చిందని, దానికి కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని” చెప్పాడు. ఇది నమ్మిన ఆ యువతి వివిధ రకాల ట్యాక్స్‌లు, చార్జీల పేరుతో రూ. 2.2 లక్షలు చెల్లించింది. రోజులు గడుస్తున్నా ఎలాంటి పార్సిల్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఢిల్లీ చేరుకున్న నగర సైబర్‌క్రైం పోలీసులు ఎల్లోట్ పీటర్, రొమాన్స్ జోషువాలను అరెస్టు చేశారు.
ఇలాంటి ఫోన్ కాల్స్ నమ్మకండి..
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, కస్టమ్స్ అధికారులమంటూ వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని నగర సైబర్ క్రైం పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. కస్టమ్స్ అధికారులెవరూ ఫోన్ చేసి టాక్స్ చెల్లించమని అడగరని స్పష్టం చేశారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ కీత మధుసూదన్‌రావు, కానిస్టేబుల్ సతీష్, భాస్కర్, మురళీకృష్ణ, క్రాంతికుమార్ల బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.