కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 15: కూకట్‌పల్లిలోని 540 ఎకరాల భూమిని ఉదాసీన్ మఠానికి ఎండోమెంట్ అధికారులు అప్పగించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శనివారం హైదరాబాద్ ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎ.బాలాజీ, ఉదాసీన్ మఠం హుస్సేనిఅలం మఠాదీశులకు 540 ఎకరాల భూమిని అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. 1873 సంవత్సరంలో నిజాం నవాబు కూకట్పల్లి గ్రామ పరిధిలోని ఉదాసీన్ మఠానికి 540.03 ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చారు. అనంతరం 1964 నుంచి 1978 వరకు నాలుగు దఫాలుగా ఈ భూమిని ఇండియన్ డిటోనేటర్ లిమిటెడ్ (గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్)కు 99 సంవత్సరాల కాల పరిమితితో లీజ్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఐడీఎల్ సంస్థ ఈ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయడం, లీజ్ నిబంధనలు పాటించకపోవడంతో ఉదాసీన్ మఠాదీశులు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 2011లో ట్రిబ్యునల్ లీజ్‌ను రద్దు చేయగా.. ఐడీఎల్ సంస్థ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా 2013లో డిస్మిస్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించిన కోర్టు ఐడీఎల్ సంస్థ పిటీషన్‌ను రద్దు చేసింది. దీంతో శనివారం అఖిలభారత ఉదాసీన్ అకాడ మహంత్ రఘుమోని బాబా, హైదరాబాద్ ఉదాసీన్ మఠం అరుణ్‌దాస్ మహంత్, మోహన్ దామోదర్ మహంత్, రామకృష్ణ, రామచంద్రలతో పాటు హైదరాబాద్ ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎ.బాలాజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేందర్, ఇన్స్పెక్టర్లు సురేందర్‌కుమార్, సురేఖ సమక్షంలో పంచనామా నిర్వహించి 540 ఎకరాల భూమిని మఠాదీశులకు అప్పగించారు.
లోక కల్యాణం కోసం..
ఉదాసీన్ మఠానికి చెందిన 540 ఎకరాల భూమిని లోక కల్యాణం కోసం ఉపయోగిస్తామని అరుణ్‌దాస్ మహంత్ తెలిపారు. ఐడీఎల్ సంస్థతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందుకు కృతజ్ఞలు తెలిపారు. ఈ స్థలాన్ని ఎవరికీ ఇచ్చేదిలేదని.. ప్రజలందరికీ ఉపయోగపడేలా అంతర్జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ కాలేజ్, అనాథల కోసం ఆశ్రమం, నిత్యాన్నదానం కార్యక్రమాలు చేపడుతామని వారు తెలిపారు.