బంజారాహిల్స్, అక్టోబర్ 15: ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 59 దరఖాస్తుల పరిశీలన షేక్‌పేట మండల పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. మండల పరిధిలో జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేయాలంటూ 1699 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు అందాయి. తొలి దశలో 1300 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు 13 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో పనిచేస్తున్న బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తున్నాయి. జీవో 59 కింద చేసుకున్న దరఖాస్తులలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయా స్థలాల్లో నిర్మాణాలు ఉన్నాయా?.. క్షేత్ర స్థాయిలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా? ..అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు.
మండల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ తదితర డివిజన్ల పరిధిలో బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ జీవో నంబర్ 59 కింద దరఖాస్తులు చేసుకున్న ఇండ్ల వివరాలు సేకరిస్తున్నారు. కోర్టు కేసులు, నాలా స్థలాలు, శిఖం భూములు లేని ప్రాంతాల్లో అభ్యంతరం లేని స్థలాలను క్రమబద్ధ్దీకరించనున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అక్కడికక్కడే రెవెన్యూశాఖకు చెందిన ప్రత్యేక యాప్‌లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిశీలన కోసం కేటాయించిన 1300 దరఖాస్తుల పరిశీలనలో భాగంగా సుమారు 95శాతం పూర్తయ్యాయని, మిగిలిన 399 దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన కేటాయింపు ఆదేశాలు రాగానే వాటిని కూడా పరిశీలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2014 కంటే ముందుగా ఆయా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న వారికే క్రమబద్దీకరణ అవకాశం కల్పిస్తున్నట్లు జీవో 59లో పేర్కొన్న సంగతి తెలిసిందే.