సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గ్రేవ్యార్డులన్నీ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. రూ. 536 కోట్లతో మొత్తం 158 శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, రెండు దశల్లో ఇప్పటివరకు 29 ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మూడో విడతలో పది ప్రాంతాల్లో గ్రేవ్ యార్డులను అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు మొదలుపెట్టింది.
అన్ని వసతులతో అన్ని వర్గాల వారికి శ్మశానవాటికలు అందుబాటులో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని గ్రేవ్యార్డులన్నింటినీ జీహెచ్ఎంసీ ఆధునీకరిస్తోంది. జీహెచ్ఎంసీ నిధులతో 158 శ్మశానవాటికలను రూ.536 కోట్ల వ్యయంతో శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫేజ్-1లో రూ. 24.13కోట్లు ఖర్చు పెట్టి 24 చోట్ల మోడల్ గ్రేవ్యార్డులను అభివృద్ధి చేసింది.
ఫేజ్-2లో 10చోట్లకుగానూ రూ. 25.02 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇందులో ఇప్పటి వరకు ఐదు చోట్ల ప్రారంభించారు. మరో ఐదు చోట్లలో ఒకటి వచ్చే నెలలో, మిగిలిన నాలుగు వాటికలను ఈ ఏడాది డిసెంబర్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగిరం చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఫేజ్-3లో మరో కొత్తగా పది చోట్ల మోడల్ గ్రేవ్ యార్డులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించి ఈ మేరకు ఆరు జోన్లలో కార్యాచరణ ప్రణాళికలను అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
సర్వహంగులతో శ్మశానవాటిక
జీహెచ్ఎంసీ నిధులతో కొన్ని శ్మశానవాటికలను అభివృద్ధి చేయడం, మరికొన్నింటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద పలు ప్రైవేట్ సంస్థలతో అభివృద్ధి చేయించింది. దీనిలో భాగంగా రాయదుర్గంలోని శ్మశానవాటికను సర్వహంగులతో రూపొందించిన మహాప్రస్థానం శ్మశానవాటిక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ మహాప్రస్థానం తరహాలోనే 158 చోట్ల శ్మశానవాటికలలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. ప్రహారీలు, చితిమంటల ప్లాట్‌ఫామ్‌లు, అస్థికలను భద్రపరిచే సౌకర్యం, ప్రార్థన గది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్, నడకదారి, ఆఫీస్ ప్లేస్, వాష్ ఏరియా, ఎలక్ట్రిఫికేషన్, హరితహారం, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులను చేపడుతున్నది.
మరో 5 చోట్ల త్వరలో అందుబాటులోకి..