బండ్లగూడ, అక్టోబర్ 12: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వార్డుల వారిగా సీసీ రోడ్డు, డ్రైనేజీ, పార్క్‌ల అభివృద్ధి తదితర పనులను చేపడుతున్నారు. మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను చేపడుతున్నారు. ప్రధానంగా విస్తరిస్తున్న శివారు కాలనీలలో మౌలిక వసతులను పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నూతనంగా ఏర్పడి న కాలనీలకు సీసీ రోడ్ల నిర్మాణం చేస్తుండడంతో ఆయా కాలనీల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో 2022 సంవత్సరం జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.38 కోట్ల నిధులు విడుదల కాగా రూ.22 కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిని రూ.16 కోట్ల అభివృద్ధి పనులలో కొన్ని కొనసాగుతుండగా మరికొన్ని పనులను ప్రారంభించాల్సి ఉంది. సుబ్రహ్మణ్య కాలనీ, లక్ష్మినగర్ కాలనీ, సాయిరాం ఎన్క్లేవ్, రాధానగర్, దర్గా ఖలీజ్ ఖాన్, పద్మశ్రీ హిల్స్, ఇండస్ వ్యాలీ, సాయి బాలాజీ నగర్, సన్ సిటీ, అభ్యుదయనగర్, కృష్ణారెడ్డి కాలనీ, గంధంగూడ గ్రామం, తిరుమల హిల్స్లలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టారు. కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు అభివృద్ధి పనులను చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తించి నిధులు విడుదల చేయించి ఆయా నిధులతో పనులను చేపడుతున్నారు. బస్తీలు, కాలనీల అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు ఎప్పటికప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సమస్యల పరిష్కారానికి కృషి
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.అభివృద్ధి పనుల నిమిత్తం రూ.38 కోట్ల నిధులు విడుదల కాగా రూ.22 కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిని రూ.16 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మరిన్ని పనులకుగాను నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏ విధమైన సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. – వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్