మేడ్చల్, అక్టోబర్ 12 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణను కాంక్షించిన సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.10వేలు కోట్లు కేటాయించారన్నారు. నగరానికి నలువైపులా రూ.4 వేల కోట్లతో నాలుగు పెద్ద దవాఖానలను నిర్మిస్తున్నారని, వెయ్యి పడకలతో ఒక్కో దవాఖాన నిర్మించనున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, నిరుపేదలకు వైద్యం చేరువైందన్నారు. బస్తీ దవాఖాన నుంచి గాంధీ దవాఖాన వరకు వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి, వైద్యుల సంఖ్యను పెంచారని తెలిపారు. ప్రతి నిరుపేదకు ఉచితంగా వైద్యం అందాలన్న లక్ష్యంతో బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నాలుగైదు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ దవాఖానల్లో మెరుగైన వైద్యంతోపాటు ఉచితంగా మందులను అందజేస్తున్నట్టు తెలిపారు. 24 గంటలు వైద్యం అందేలా కృషి చేస్తున్నామన్నారు.
అభివృద్ధిలో మేటీ గుండ్లపోచంపల్లి..
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 8, 11 వార్డుల్లో రూ.75లక్షల వ్యయంతో నిర్మించిన వీధి దీపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పాలన బాధ్యతలు చేపట్టిన రెండున్నరేండ్లలో గుండ్లపోచంపల్లిని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లో సౌకర్యాలు కల్పించారని చైర్పర్సన్, కౌన్సిలర్లను అభినందించారు. ఒక్కో వార్డులో రూ.2కోట్ల మేర అభివృద్ధి పనులు చేశారన్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఒక్క వీధి దీపాలకే రూ.3.5 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
అయోధ్య చౌరస్తా రోడ్డును కూడా త్వరలో బాగుచేసే పూచీ తనదేనన్నారు. గుండ్లపోచంపల్లి అనూహ్య అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో రూ.కోటి కేటాయించాలని ఆయన చైర్పర్సన్కు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో శ్రీనివాస్, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, అమరం జైపాల్ రెడ్డి, అమరం హేమంత్ రెడ్డి, చింత పెంటయ్య, వీణాసురేందర్ గౌడ్, శ్రీలతాశ్రీనివాస్ రెడ్డి, రాజకుమారి సుధాకర్, ఆంథోనమ్మఫిలిప్స్, సాయిపేట శ్రీనివాస్, బేరి బాలరాజ్, కమిషనర్ రాములు, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి,
టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, నాయకులు జనార్దన్ రెడ్డి, సురేందర్ గౌడ్, ఫిలిప్స్, సుధాకర్, వైద్య సిబ్బంది
పాల్గొన్నారు.