సిటీబ్యూరో, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : “తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వరుడి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం శ్రీనివాసుడికి శాస్ర్తోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. నిత్య సేవలో భాగంగా సుప్రభాతంతో పాటు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు హాజరుకాగా వేంకటేశ్వర నామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మార్మోగింది. సాయంకాలం శ్రీనివాసుడు శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితుల సమక్షంలో జరిగిన సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దంపతులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన విద్యాంసురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి కన్యాకుమారి వయోలిన్ వాద్య సంగీతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గురజాడ మధుసూదనరావు బృందం అన్నమయ్య కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధార్మిక ప్రోగ్రామ్స్ అధికారి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విబీషణశర్మ, విజివో మనోహర్, ఏఈవోలు జగన్మోహనాచార్యులు, పార్ధసారథి, శ్రీరాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు