సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఐటీ కారిడార్‌లో ఇన్ఫోర్ సంస్థ కొత్తగా విస్తరించిన డెవలప్మెంట్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ బుధవారం ప్రారంభించారు. ఇప్పటికే నగరంలో ఉన్న ఇన్ఫోర్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, కొత్తగా విస్తరించిన డెవలప్మెంట్ క్యాంపస్(డీసీ) 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, ఇందులో 3500 మంది ఉద్యోగులు పనిచేస్తారని ఇన్ఫోర్ సంస్థ సీఈఓ కెవిన్ సామ్యూల్సన్ తెలిపారు.
ఇన్ఫోర్ సేవల విస్తరణను స్వాగతిస్తున్నాం : మంత్రి కేటీఆర్
ఇన్ఫోర్ సంస్థ తమ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో భారీ ఎత్తున విస్తరణ చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నిలయంగా హైదరాబాద్ మహానగరం మారిందన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఐటీ హబ్‌గా నగరం ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు. ఇన్ఫోర్ వంటి కంపెనీలు ఇక్కడ తమ పెట్టుబడులను మరింత పెంచడం పట్ల సంతోషంగా ఉందన్నారు. కంపెనీలు తమ వ్యాపారాలను బలోపేతం చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా కార్యాలయాలను నిర్వహించడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.