సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మొన్న గేమింగ్.. నిన్న లోన్ యాప్.. నేడు ఇన్విస్ట్మెంట్ యాప్‌ల పేరుతో నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో సామాన్య ప్రజలను మోసం చేసి సేకరించిన డబ్బును హవాల ద్వారా విదేశాలకు చేరవేస్తున్నారు. ఈ అంతర్జాతీయ భారీ హవాల రాకెట్ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. తాజాగా.. చైనీయులు తెర వెనుక ఉండి నిర్వహిస్తూ.. ఇన్విస్ట్మెంట్ యాప్ మోసం ద్వారా రూ.903 కోట్లు సేకరించి.. ఆ డబ్బును హవాల ద్వారా విదేశాలకు తరలించినట్లు సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణలో బయటపడింది. ఈ మేరకు ఇద్దరు విదేశీయులతో పాటు ఎనిమిది మంది ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు చెందిన వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం వివరాలను వెల్లడించారు. పెట్టుబడి పేరుతో లోగ్జామ్ (ఎల్ఓఎక్స్ఎమ్) యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు రూ. 1.6 లక్షలు మోసం చేశారంటూ జూలై నెలలో తార్నాకకు చెందిన బాధితులు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. డబ్బు బదిలీ అయిన మార్గాలను గుర్తించారు. బాధితుల డబ్బు ఇండస్ ఇండ్ బ్యాంక్‌లోని ఎక్స్ ఇండియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఖాతాలోకి వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీ వీరేందర్ సింగ్‌దిగా గుర్తించిన సైబర్‌క్రైమ్ పోలీసులు.. పుణెలో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చైనా లింక్‌లు బయట పడ్డాయని సీపీ వివరించారు.
చైనీయుల ఆదేశాలతో…
చైనాకు చెందిన జాక్ అనే వ్యక్తి ఆదేశాలతో ఎక్స్ ఇండియా టెక్నాలజీస్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచాడు. ఈ అకౌంట్‌కు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్ ఐడీ, పాస్వర్డ్ అతడికి పంపించాడు. ఈ ఖాతాతో లింక్ ఉన్న బెంటెక్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు బయటకు వచ్చింది. ఈ ఖాతాను ఢిల్లీకి చెందిన సంజయ్ కుమార్, చైనాకు చెందిన లెక్ అలియాస్ లి ఝూవాంజు ఆదేశాలతో ఖాతాను తెరిచి, ఆ వివరాలను చైనాకు చెందిన పెయ్, హున్ జహున్లకు అందించాడు. ఈ క్రమంలోనే హవాలా దందాను కొనసాగించారు. భారత్‌లో వ్యవహారం నడిపిస్తున్న వారికి పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తున్నారు.
కంబోడియానే అడ్డా..
2019-20 మధ్యలో చైనీయులు భారత్‌లోకి వచ్చి గేమింగ్, లోన్, ఇన్విస్ట్మెంట్ ఫ్రాడ్లకు సంబంధించిన పునాదులు వేశారు. అప్పటికే చైనాలో ఉండి వచ్చిన వారిని తమ అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేసులో సంజయ్, నవనీత్ రెండేండ్ల పాటు చైనాలో ఉండి వచ్చారు. వీరిద్దరికి చైనా భాష రావడంతో వారు చైనీయులకు ట్రాన్స్లేటర్లుగా ఉంటున్నారు. కరోనా సమయంలో చాలా మంది తమ దేశాలకు వెళ్లిపోయారు. తెలంగాణ పోలీసులు గేమింగ్, లోన్ యాప్‌ల దర్యాప్తులో చైనీయుల పాత్ర ఉన్నదని తేల్చి, భారీ కుంభకోణాలను వెలుగులోకి తెచ్చారు. కొందరు చైనీయులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనీయులు చాలా వరకు నేరుగా భారత్‌లోకి రాకుండా.. చైనా నుంచే చక్రం తిప్పుతున్నారన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. వీరి కార్యకలాపాలకు కాంబోడియాను వేదికగా చేసుకున్నారు. చైనాలోని జిన్‌పింగ్ వెంచర్స్ పేరుతో నిర్వహించే కంపెనీ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. వీళ్లే కంబోడియాలో అడ్డాను ఏర్పాటు చేసి, భారత్‌లో తమ అనుచరులు కమీషన్ పద్ధతిలో తెరిచే బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులను కొరియర్ల ద్వారా కంబోడియాకు పంపిస్తున్నారు.
ఆర్బీఐ నిబంధనలు బేఖాతర్
ఫారెన్ మనీ ఎక్స్చేంజిలు ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొంది పూర్తి నిబంధనలు ఉల్లంఘించారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో మహేశ్ బ్యాంక్‌లో, పేమెంట్ గేట్‌వే కేసులోనూ నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐకి లేఖ రాశామని సీపీ తెలిపారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన మనీ ఎక్స్చేంజిల దందాలో పూర్తి ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే రూపాయలు తీసుకొని, విదేశీ కరెన్సీ ఇవ్వాలని, అలాంటిది వందల కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆయా సంస్థలు ఏడు రకాల రిజిస్టర్లు నిర్వహించాలన్నారు.
ఒక్కటి కూడా నిర్వహించడంలేదన్నారు. నెల వారీగా, మూడు నెలలకు ఒకసారి ఆర్బీఐకి స్టేట్మెంట్ పంపించాల్సి ఉంటుందని, నిబంధనలు పాటించడంలేదన్నారు. వీటన్నింటిపై ఆర్బీఐకి లేఖ రాస్తామన్నారు. వర్చువల్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం, వాటి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, విదేశాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉన్నదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కేసులో రూ.1.91 కోట్లు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు. ఈ సమావేశంలో నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.