సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): పోలీసు సిబ్బందికి ఇక నుంచి పోలీసు కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. అంతే కాకుండా వడ్డీ రేటును కూడా 0.5 శాతానికి తగ్గించనున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన బుధవారం జరిగిన సైబరాబాద్ పోలీసు కో ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్న రూ. 5 లక్షల రుణాన్ని.. ఇక నుంచి రూ.10 లక్షలకు పెంచి, వడ్డీ రేటు శాతాన్ని కూడా తగ్గించారు. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. పోలీసు సిబ్బంది పిల్లల ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ను పెంచడం, కొత్త సొసైటీని ఏర్పాటు చేయడం.. తదితర తీర్మానాలు చేశారు. అనంతరం వైకె ఇన్నోసాఫ్ట్ టెక్నాలజీ సహకారంతో నూతనంగా రూపొందించిన ‘స్మార్ట్ సీబీఎస్’ యాప్ను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ యాప్ను సైబరాబాద్ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పొందుపరిచినట్లు తెలిపారు.
ఈ యాప్ ద్వారా కో- ఆపరేటివ్ సొసైటీలోని ఎలాంటి సమాచారాన్ని అయినా సభ్యులు వెంటనే పొందవచ్చని సీపీ సూచించారు. వైకే ఇన్నో సాఫ్ట్ టెక్నాలజీ సహకారంతో కో ఆపరేటివ్ సొసైటీలో నూతనంగా సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఎలాంటి సమాచారమైనా పొందవచ్చని సూచించారు. సాఫ్ట్వేర్ను అందించిన వైకే ఇన్నో సాఫ్ట్ టెక్నాలజీ అధినేత శ్రావణ్ కీర్తి పాటి, వారి బృందాన్ని సీపీ మెమెంటో ఇచ్చి అభినందించారు. అదే విధంగా.. సమావేశంలో భాగంగా నూతన కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకోవాలని సొసైటీ సభ్యులు సీపీకి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే కొత్త కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకుంటామన్నారు.
సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గచ్చిబౌలి, మొయినాబాద్, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యుల సంక్షేమానికే వినియోగిస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. పోలీసు కో-ఆపరేటివ్ సొసైటీలో కొత్త పాలసీలు, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రవేశపెట్టి, మరింత మెరుగైన సేవలను అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి సూచించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ ఇందిర, ఎస్బీ ఏసీపీ సురేందర్రావు, సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటయ్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి, వైకే ఇన్నోసాఫ్ట్ సీఈవో శ్రావణ్ కీర్తిపాటితో పాటు పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.