సిటీబ్యూరో, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ) : పండుగొస్తుందంటే చాలు.. శుభ సమయం.. అదిరేటి ఆఫర్లు… ఇలా అన్నీ కలిసొస్తుండటంతో వాహనాల విక్రయాలు జోరందుకుంటాయి. ఇప్పటికే గ్రేటర్లో 86.40 లక్షల వాహనాలు ఉండగా, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరుగనున్నది. ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వాహనాలు అధికంగా అమ్ముడుపోతున్నాయని షోరూం లెక్కలు చెబుతున్నాయి. అందులో భాగంగానే గ్రేటర్లోనూ ఈ రెండు నెలల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్లు అధికంగా అయ్యాయి. గత ఏడాది ఈ రెండు నెలల్లో 38,729 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ప్రస్తుతం సెప్టెంబర్, అక్టోబర్ 12 వరకు 62,215 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే వాహనాల వాటా అధికంగా ఉంది.