మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 12 : రాష్ట్రంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో రూ.31లక్షల మున్సిపల్ నిధులు, రూ.10 లక్షల ఐకాం కంపెనీ నిధులతో ఏర్పాటు చేసిన 166 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో 80శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో భద్రత, భరోసా, నేరాల నియంత్రణ సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ రష్మి పెరుమాల్, మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐలు, కౌన్సిలర్లు, అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.