సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): డూప్లికేట్ ఓట్లను నివారించేందుకు చేపట్టిన ఆధార్ ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కోటి మందికి పైగా ఓటర్లున్నారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 89 లక్షల మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లాకు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు , సిబ్బంది గడిచిన రెండున్నర నెలలుగా ఓటర్లకు ఆధార్ అనుసంధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు లక్ష వరకు ఆధార్ కార్డులను అనుసంధానం చేశారు. ఈ క్రమంలోనే ఓటర్లలో విస్తృత అవగాహన కల్పిస్తూ అనుసంధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపి అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేశారు. ఆధార్ లేదా మరో 10 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డుతో ఓటరు కార్డును అనుసంధానం చేసుకోవాలని కోరుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటరు హెల్ప్‌లైన్ ఆప్లికేషన్ ఉంటుందని, అందులో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య (ఎపిక్ నంబరు)ను పొందుపరిచి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఎన్వీఎస్పీ వెబ్సైట్లోనూ అనుసంధానం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు.
స్వచ్ఛందంగా చేసుకోండి ..
ఓటరు జాబితాలో బోగస్, డూప్లికేట్ పేర్లను లేకుండా చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలోని పేరుకు అనుసధానాన్ని స్వచ్ఛందంగా చేసుకునేందుకు ప్రజా ప్రాతినిధ్యం చట్టాన్ని సవరించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. జనవరి1, 2023 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయిన వారంత ఓటరు నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు. నూతన ఓటరుగా నమోదు చేసుకునే వారంతా ఆన్లైన్లో WWW.NVSP.INలో గానీ, ఓటరు హెల్ప్ లైన్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. ఆఫ్‌లైన్‌లో చేసుకునే వారంతా బిఎల్ఓ, ఈఆర్ను సంప్రదించి ఆధార్ అనుసంధానం, నూతన ఓటరు నమోదు ప్రక్రియను చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.