రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదీగా శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్ తీర్పునిచ్చారు. అదనపు పీపీ విద్యావతి రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్ మండలం ఎల్కాగూడ గ్రామానికి చెందిన ఏలూరి యెట్టయ్యతో లక్ష్మికి 18 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్నారు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన నిందితుడు ఏలూరి రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారం భర్త యెట్టయ్యకు తెలియడంతో భార్య లక్ష్మిని మందలించాడు. దీంతో భర్త యెట్టయ్యను చంపాలని నిర్ణయించుకున్న భార్య.. తన ప్రియుడి రాజుకు విషయం తెలిపింది. రాజు తన స్నేహితుడైన రాజేంద్రనగర్‌కు చెందిన అజార్ అహ్మద్ పాషా సహాయం కోరాడు. 2013, ఫిబ్రవరి 4న యెట్టయ్య తన ఇంట్లో ఆరు బయట నిద్రిస్తుండగా రాజు, అజార్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహన్ని కిస్మత్పుర వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. జరిగిన వ్యవహారంపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు ముగ్గురిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణలో ఉండగానే ఇద్దరు నిందితులు మృతి చెందారు. ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న రాజుకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.