మెడ్చల్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు దాదాపు రూ. 20 లక్షల విలువజేసే సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
రూ.20 లక్షల సొత్తు అపహరణమేడ్చల్ రూరల్, అక్టోబర్ 10 : మెడ్చల్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు దాదాపు రూ. 20 లక్షల విలువజేసే సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మేడ్చల్ పట్టణ పరిధిలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను నిర్వాహకులు రోజువారి మాదిరిగానే ఆదివారం కూడా రాత్రి 10 గంటల సమయంలో తాళం వేసి వెళ్లిపోయారు. దుకాణం నిర్వాహకులు సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చి షోరూమ్ తాళాలు తీసి చూడగా.. సెల్ఫోన్లు, సామగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన నిర్వాహకులు, సిబ్బంది షోరూమ్ మొత్తాన్ని పరిశీలించారు. 4వ అంతస్తు పైనున్న రేకులలో ఒక రేకు వంగి పోయినట్టు గుర్తించారు. అక్కడి నుంచే దుండగులు షోరూమ్‌లోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. దుకాణంలో నుంచి రూ.20.08 లక్షల విలువజేసే వివిధ కంపెనీలకు చెందిన 40 సెల్ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు పోయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దుకాణం ఐటీ మేనేజర్ నాగేంద్ర గౌడ్ మెడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని సీఐ రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. మెడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.