సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో దాదాపు 6000 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ మేర కు ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టి.. పీపీపీ విధానం ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్తా చెదారం.. గడ్డి ఉండటం, సరైన ఫెన్సింగ్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) ప్రాతిపదికన 10 సంవత్సరాల రాయితీ వ్యవధితో ప్రైవేట్ ఎజెన్సీలకు అప్పగించి, అభివృద్ధి చేయనున్నారు.
ఆరు జోన్లు.. 6 వేల ట్రాన్స్ఫార్మర్లు..
నగరంలోని ఒక్కో జోన్లో 1,000 చొప్పున ఆరువేల ట్రాన్స్‌ఫార్మర్లలను గుర్తించి వాటి వద్ద ప్రైవేట్ ఎజెన్సీలకు అడ్వర్టయిజ్మెంట్ కోసం స్పేస్‌ను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. తద్వారా ఆదాయం కూడా పెంచుకోవచ్చని అధికారుల అంచనా. సదరు ఎజెన్సీ నిర్వాహకులు ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ పిల్లర్, సెఫ్టీ ఫెన్స్‌ను నిర్మించడం, ఒకే బోర్డుతో ప్రకటన స్థలం కోసం ఒక నిర్మాణ స్తంభాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా టెండర్లో నిబంధనలు పెట్టారు. రూపకల్పన, ఇంజినీరింగ్, సేకరణ, ఫైనాన్సింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణకు సదరు ఎజెన్సీలు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఉన్న పరిసరాల అభివృద్ధికి ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రకటనల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదనలకు బిడ్స్ ఆహ్వానించింది. రెండు రకాల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) స్థానాలను గుర్తించింది. వీటిలో ఎల్బీ నగర్ జోన్లో టైప్-ఏ కేటగిరీలో 157, 843 టైప్-బీ డీటీఆర్ స్థానాలు, చార్మినార్ జోన్లో 345, 655, శేరిలింగంపల్లిలో 102, 898 ఖైరతాబాద్ జోన్లో 337, 663, కూకట్పల్లి జోన్లో 297, 703 ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 768 టైప్-బీ ఉన్నాయి.