అబిడ్స్, అక్టోబర్ 10 : రోజురోజుకూ విస్తరిస్తున్న మహానగరంలో వాహనాల రద్దీ పెరిగిపోతున్నది. నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రోడ్లు రద్దీగా మారడంతో భారీగా ట్రాఫిస్ స్తంభించి పోతున్నది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రోడ్ల విస్తరణ పేరుతో మార్కింగ్ చేసిన అధికారులు పనులను మరిచిపోవడంతో రోజురోజుకూ సమస్య జఠిలంగా మారుతున్నది. మార్కింగ్ చేయగానే రోడ్డు విస్తరణ జరుగుతుందని సంతోష పడిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రోడ్డును విస్తరించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనిప్రజలు కోరుతున్నారు.
పాత ముంబాయి ప్రధాన రహదారి (మల్లేపల్లి)లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతున్నది. వాహనాల రద్దీ పెరిగిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పద్మవ్యూహాన్ని తలపిస్తున్నది. ఫలితంగా రోడ్డుపై రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు విముక్తి కల్పించేందుకు గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ రహదారి విస్తరణకు చర్యలు చేపట్టారు. అప్పట్లో మార్కింగ్ కూడా చేసినట్లు వ్యాపారులు తెలిపారు. అంతకు ముందు మెహిదీపట్నం నుంచి బోయిగూడ కమాన్ వరకు ఈ రహదారిని విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుని ప్రధాన రహదారి విస్తరణ పనులను చేపట్టారు. అదేవిధంగా మల్లేపల్లి చౌరస్తా నుంచి మొదలుకుని బోయిగూడ కమాన్ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలుసుకున్న వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మార్కింగ్ చేసిన అధికారులు పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తుండటంపై వ్యాపారులు మండిపడుతున్నారు. పాత ముంబాయి ప్రధాన రహదారి కాగా ఇప్పటికీ భారీ వాహనాలు ఈ రహదారి మీదుగానే వెళ్తుంటాయి. దీంతో మల్లేపల్లి, బోయిగూడ కమాన్ తదితర ప్రాంతాల్లో తరచుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతున్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారిని విస్తరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.