మియాపూర్, అక్టోబర్ 10 : ప్రజారోగ్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని, అమలు చేసే విభాగాల మధ్య సమన్వయలోపం ప్రజలకు ఏమాత్రం ఆటంకంగా పరిణమించకూడదని విప్ గాంధీ పేర్కొన్నారు. స్వచ్ఛమైన పరిసరాల కోసం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. చందానగర్ శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై సదరు విభాగం అధికారులు రాంకీ సంస్థతో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ మియాపూర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదంటూ చెత్త కుప్పల తొలగింపును పకడ్బందీగా చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంకీ పారిశుద్ధ్య విభాగాలు సమన్వయంతో పని చేసి వీధులలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. ఈ విషయంపై అలక్ష్యాన్ని ఏమాత్రం సహించబోనని విప్ స్పష్టం చేశారు. వర్షాలకు చెత్త డ్రైనేజీలు, నాలాల్లో చేరుతూ వరద నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ముంపు ప్రమాదం నెలకొంటున్నదన్నారు. సంబంధిత అధికారులు తగు పర్యవేక్షణ చేపట్టి మెరుగైన పరిసరాలను నెలకొల్పాలని విప్ గాంధీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు నగేశ్, కార్తిక్, జలంధర్‌రెడ్డి, శ్రీనివాస్, మహేశ్, శ్రీనివాసరెడ్డి, కనకరాజు, బాలాజీ, గంగిరెడ్డి, బాలరాజు, కృష్ణ, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.