కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 10 : పారిశుధ్య కార్మికులందరూ ఆరోగ్య రక్షణ కోసం సేఫ్టీ కిట్లను తప్పనిసరిగా ధరించాలని కూకట్‌ల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిత్యం విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులకు మెరుగైన ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో రోడ్లపై విధులు నిర్వర్తించేందుకు వీలుగా కార్మికులకు రెయిన్ కోట్లు, రేడియం రక్షణ జాకెట్, రెండు జతల గ్లౌజెస్, సేఫ్టీ షూస్, 40 సబ్బులు, 1 టవల్, 3 శాటిటైజర్ బాటిళ్లు, 2లీటర్ల కొబ్బరి నూనె, 56 మాస్కులతో కలిపి 11 వస్తువులతో కూడిన కిట్ బ్యాగులను అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో సేఫ్టీ కిట్లను ధరించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్మికులు మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీ రవికుమార్, ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, విశ్వనాథం తదితరులున్నారు.