అంబర్‌పేట, అక్టోబర్ 10 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ పాములబస్తీలో స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిపించేందుకు అందమైన పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి డివిజన్లోని పాములబస్తీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పాములబస్తీ, మందులబస్తీ ఇతర రెండు గల్లీల ప్రజలు ఇక్కడ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా బస్తీల పెద్దలు సంతకాలు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. పార్కును ఏర్పాటు చేస్తే స్థానిక బస్తీల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవిలతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పాములబస్తీలో మంచి పార్కును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మందులబస్తీలో పర్యటించారు. అక్కడి వారు తమ బస్తీలో డ్రైనేజీ సమస్య ఉందని, కొత్త డ్రైనేజీ పైపులైన్ వేయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బస్తీ నుంచి పార్కు ద్వారా అయ్యప్ప టెంపుల్ రోడ్డుకు వెళ్లేందుకు చిన్న దారిని ఏర్పాటు చేయాలని తెలిపారు. అందుకు ఎమ్మెల్యే తప్పకుండా దారి ఏర్పాటు చేయిస్తానని బస్తీవాసులకు చెప్పారు. కొత్త డ్రైనేజీ పైపులైన్ కూడా ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు ఇ.ఎస్. ధనుంజయ, రమేశ్‌నాయక్, బంగారు శ్రీనివాస్, రాజు, స్వామి, సుభాష్, రాజేశ్, కనివేట నర్సింగ్‌రావు, బస్తీ వాసులు రావుల సుధాకర్, నిరంజన్ పాల్గొన్నారు.