సికింద్రాబాద్, అక్టోబర్ 10: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని తార్నాక డివిజన్లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డిలతో కలిసి సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వద్ద ఆయన లబ్ధిదారులకు నూతన పింఛన్ల గుర్తుపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గతంలో 16 వేల మందికి ఆసరా పించన్లు అందించామని, కొత్తగా మరో ఆరు వేల మందికి ప్రస్తుతం పింఛ న్లు మంజురయ్యాయని తెలిపారు. లబ్ధిదారులు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సం క్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధ్దానాలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ మాటతప్పదని, నూతన పింఛన్ల మంజూరుతో ఇది మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. అనంతరం బౌద్దనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ బౌద్దనగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు ఆసరా పించన్ల గుర్తింపు కార్డులను అందజేశారు. ఆదే విధంగా సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కార్పొరేటర్ సామల హేమ ఆసరా గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మారేడ్‌పల్లి తాసీల్దార్ మాధవిరెడ్డి, అయ్యప్ప, నేతలు కంది నారాయణ, కిశోర్‌కుమార్, కిరణ్‌కుమార్, రామేశ్వర్‌గౌడ్, త్రినేత్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.