ఎల్బీనగర్, అక్టోబర్ 9: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను టార్గెట్‌గా మచ్చిక చేసుకునే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి కుటుంబంలో ఒక భాగంగా మారిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి ఓట్లు పడేలా చేసేందుకు నాయకులు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ప్రచారానికి తరలివెళ్లిన నాయకులను ప్రతి బూత్‌లో నియమిస్తున్న ఐదు మందిలో ఒకరు ఎల్బీనగర్కు చెందిన వారు ఉండేలా ప్రణాళిక చేశారు. వీరు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను టీఆర్ఎస్కు ఓటు వేసేలా అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గంలో నివసిస్తూ మునుగోడుకు చెందిన ఓటర్లను గుర్తిస్తున్నారు. వారి బంధువులు, మిత్రులను సమన్వయకర్తలుగా చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
ప్రధానంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డితో పాటుగా పలువురు నాయకులకు మునుగోడు నియోజకవర్గంలో బంధువులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ఓటర్లను వారి బంధుమిత్రులతో కలువడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించే పనిలో ఉన్నారు. అంతేకాక ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓటర్లను వారి నివాసాల వద్ద ఉన్న బంధువులు, మిత్రుల సహకారంతో కలుస్తున్నారు. మునుగోడు ఓటర్ల సమాచారం సేకరిస్తున్న పార్టీ శ్రేణులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాల్ సెంటర్‌ను నిర్వహణ చేసి ఓటర్లను ఫోన్ల ద్వారా అభ్యర్థించే పనిలోనూ నిమగ్నం అవుతున్నారు. మొత్తంగా మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకను ఇవ్వాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు.